Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రత్యేక గీతాలు ఇష్టంతోనే చేస్తున్నా.. ఐటం గర్ల్ అంటే పళ్లు రాలగొడతా!: మలైకా అరోరా

  • కెవ్వు కేక పాటలో నర్తించిన మలైకా
  • సినిమాలకు ప్రత్యేక గీతాలు ఆకర్షణ అని వ్యాఖ్య
  • ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలీవుడ్ నటి
పవన్ కల్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’లో కెవ్వు కేక పాటతో తెలుగులో కూడా ఫేమస్ అయిన నటి మలైకా అరోరా కొందరు వ్యక్తులపై మండిపడ్డారు. సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించే తనను ఐటమ్ గర్ల్ అని సంబోధిస్తే పళ్లు రాలగొడతానని హెచ్చరించారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దర్శక-నిర్మాతలు ఇప్పుడు సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండేలా చూసుకుంటున్నారు. కానీ నా ఆలోచనా విధానం వేరు. ఒక నటికి ప్రత్యేక గీతంలో నర్తించడం ఇష్టం లేనప్పుడు అందుకు ఒప్పుకోకపోవడమే మంచిది. అయితే ఇలాంటి పాటలను పూర్తిగా నిషేధించాలని నేను చెప్పడం లేదు.

నేను ఏదన్నా పాటలో నర్తిస్తే దాన్ని అందరూ ఐటం సాంగ్‌ అంటుంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఒకవేళ నన్ను ఎవరైనా ‘ఆమె ఐటెం గర్ల్‌’ అని అన్నారంటే పళ్లు రాలగొట్టేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. తాను ఇష్టపూర్వకంగానే ప్రత్యేక గీతాల్లో నటిస్తాననీ, ఇందులో ఎవరి బలవంతం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. సినిమాలో కాస్త ఫన్‌ ఉండాలంటే ఇలాంటి పాటలు ఉండి తీరాల్సిందే అని అభిప్రాయపడ్డారు.

షారుక్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ సినిమాలో ‘చల్  ఛయ్య..ఛయ్యా..ఛయ్యా’ అనే ప్రత్యేక గీతంతో మలైకా కెరీర్ ను ప్రారంభించారు. దబాంగ్ సినిమాలో ‘మున్నీ బద్నామ్ హుయీ’ తో పాటు పలు ఇతర పాటలకు నర్తించారు. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ను త్వరలోనే మలైకా వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Bollywood
malika arora
item songs
angry

More Telugu News